Sunday, December 2, 2012

An Actor


నటుడ్ని, నటననే తపనని
నరనరాన రక్తం పరిగెట్టే వరకు
స్వరపేటికలో మాటలు పెలేవరకు
నడుము వంగి మూలన పడేవరకు
నలుగురు నన్ను మోసేసే వరకు

నవ్విస్తూ ఏడిపించినా
భయపెడుతూ మేలుకొలిపినా
నీ ముందరున్నది నేనుకాదులే
నే లేతే వాడే లేడులే

ఛీవాట్లు నన్ను చీదరించినా
చప్పట్లు నన్ను సత్కరించినా
నిన్నటి వేషం మారిపోదులే
రేపటి వేషం ఆగిపోదులే

నాలో కలలు కళలై
రాసే వాడి రాతలకు మాటనై
తీసేవాడి చేతలకు చిత్రాన్నై
మీ స్వరూపాలకు, ప్రతిరూపమై

లాగి లాగి డైలాగులు చెబితే
వేలుమడిచి విజిల్ కోడతావ్
ఎగిరి ఎగిరి పోరాటాలు చేస్తే
కేకలేస్తూ కేరింతలు చేస్తావ్
చీకటి గదిలో జనమెంతవున్న
నిన్నే మరచి నన్నే చూస్తావ్ 

రీల్ లైఫ్లో రోలవుతున్నా
రియల్ లైఫ్లో బోర్లాపడితే
పర్సనల్ మేటర్ పబ్లిక్ చేస్తావ్
టీ త్రాగుతూ టైంపాస్ చేస్తావ్


ముసుగు తీస్తే నేను మనిషినే
చేతకాదు తెరవెనుక నటనే
తప్పు ఒప్పులు నాకు సహజమే
గ్లిసరిన్ లేని కన్నీళ్లు కామనే

నా పరిహాసాలు నీకు దరహాసాలు
నా విశ్వరూపాలు నీకు ఆరాధ్యాలు
నా సలక్షణాలు నీకు ఆదర్శాలు
నా విలక్షణాలు నీకు ఆహ్లాదాలు

తెల్లటి తెరపై రంగుల బొమ్మలు
నాలుగు గోడల మధ్య నాలుగు ఆటలు
టిక్కెట్ కొని నువ్వు సీటుకు చేరితే
నీ ప్రతి రూపాయికి నే న్యాయం చేస్తా