Tuesday, December 4, 2012

Never QUIT Life



రేతిరి నిదొరోతే
వేకువ మెలకువరా
నీది శాశ్వత నిదరైతే
ఏ ఏడుపు మేలుకొలుపురా 

నువ్వు పొతే చింత
మరల పుడితే క్రొత్త
చావురాని బ్రతుకుందా
కన్నీళ్లు రాని చావుందా

బ్రతుకుకే బెదిరితే బలి అవుతావు
గెలుపొచ్చే వేళకు గతమవుతావు
వేలెత్తిచూపేవాళ్ళకు అలుసవుతావు
కన్నవాళ్ళ కళ్ళలో కన్నీళ్ళవుతావు

నిన్ను కన్నది మోయడానికి కాదు
నువ్వు పోయాక బ్రతికుండేది, చావలేక కాదు
మరణానికి అందరూ బంధువులే
పిలువని పేరంటానికి పోమాకులే

కష్టానికి కళ్లుండవు
నీ కన్నీళ్లు చూడడానికి
ఇష్టానికి నోరుండదు
నీపై కడుపుతీపి చెప్పడానికి

నీ దాహం తీర్చే నీరే కరువయిందా
నీ ఊపిరికందక గాలే దూరమయిందా 
నీ ఆకలి తీర్చిన అమ్మపాలకు అర్ధంవుందా
నీకు పుట్టేవాడికి ఇక సృష్టే వుంటుందా 

నడవడం రాత
నడిపించడం గీత
నడుమన ఈ పరుగులో
ఏమున్నదిలే వింత 

నిన్ను చంపితే హత్య
నువ్వు చంపితే హత్య
నిన్ను నువ్వు చంపితే ఆత్మహత్య
ఆ ఆలోచనలనే చంపితే భగవద్గీత