ఏ యిజం అయినా ఏ నిజమైనా
మనిషి నైజం మారని నాడు
మనసు మురికిని కడగనినాడు
తర తరాల చరితలో
యుగ యుగాల వరుసలో
మారినది మనిషైన మృగం
మారనిది మనిషిలోని మృగం
కొనసాగినది వారసత్వ దౌర్భాగ్యం
భరత మాత రాజ్యంలో
వేదభూమి నడిబొడ్డులో
నిశి రాతిరి చెరసాలలో
విష వలయపు సుడిగాలిలో
అక్షరాస్యుల అరాచకత్వం
అశ్లీల అఘాయత్యం
మరవబడ్డ మానవత్వం
మైలబడ్డ తల్లితత్వం
మనిషి జననానికి వేదమైన కార్యం
మహిళ మనడానికి గ్రహణమైతే
చదివి గెలవాల్సిన వయస్సుకు
బ్రతికి శవమై మంచాన పడితే
కడుపులు రగిలి కట్టలు తెగి
కొవ్వొత్తులు పట్టి వీదులకెక్కి
మూలనబడ్డ రాజనీతిపై
గళములనెత్తి నిరశన చేస్తూ
కుంటుబడ్డ శిక్షాస్మృతిని
సూటిగా చూస్తూ రాళ్ళను విసురుతూ
ఉవ్వెత్తున ఎగసెను యువ కెరటం
న్యాయం కోసం తిరగబడుతూ
అలసి చతికిలపడితే పోరాటం
మరచిపోదా జగతి గతించిపొతూ
మరల ఎదురుపడదా ఈ గ్రహచారం
మృగ వారసత్వం వంటపడుతూ