సుస్వరాల అరలలో
స రి గ మ ప ద ని వరుసలలో
పదాల మైనం పెదాలతో పూసి
గళాల పుక్కిట సాహిత్యపు తేనెను తెచ్చి
చిటారు కొమ్మన దాచిన మిఠాయి పొట్లం
ఇళయరాజా పాట
పదహారు పరువం రాగాలను కూర్చి
కొంగుచాటు అందాల భావాలను గుచ్చి
హోయలోలికే నడకలు లయగా చేర్చి
వణికే అధరాలనే సంగతులుగ వేసి
పందిరి మంచం నీడలో, కౌగిట చేరిన కన్నె అందం
ఇళయరాజా పాట
అమ్మ పడ్డ ప్రసవ వేదన నాదంగా
గుండె నిండిన అక్షర పాలే కావ్యంగా
బుడి బుడి అడుగులనే తాళంగా వేస్తూ
ముద్దు ముద్దు మాటలనే మూటకట్టి
అమ్మఒడిలో నిదురన, వెన్నెల లాలి
ఇళయరాజా పాట
ఉరకలు వేసే గోదారి పరవళ్ళు బాణిలుగా మలచి
ముసలి శబరి ఎంగిలి భక్తిని కోరస్ గా కూర్చి
హనుమయ్య మదిలో రామనామాన్ని పల్లవించి
భద్రాద్రి రాముని చరణాలనే, చరణంగా మార్చి
సీతమ్మ నుదుటన రామయ్య దిద్దిన కుంకుమ రేఖ
సీతమ్మ నుదుటన రామయ్య దిద్దిన కుంకుమ రేఖ
ఇళయరాజా పాట