జీవితం ఓ అనుభవం
అనుభవిస్తే సాగిపోతుంది
అలసిపోతే ఆగిపోతుంది
భయపడితే బరువనిపిస్తుంది
మనసుపడితే మురిసిపోతుంది
మనిషి పడితే చచ్చిపోతుంది
గోళీలాటలకు బాల్యమవుతుంది
వయసు మళ్ళితే జ్ఞాపకమవుతుంది
సుదూర తీరాలపై ఆశ పడుతుంది
కలల వలలలో చిక్కుకుంటుంది
కన్నీటి అలలపై ఎగసిపడుతుంది
నిరాశ నావలపై ఈదుతుంటుంది
వేకువ వేళ మొదలవుతుంది
రేతిరి వేళ నిదురవుతుంది
వోటమి వేళ నిట్టూర్పవుతుంది
గెలిచిన వేళ మళ్ళీ మొదటికొస్తుంది
గుండెమాటుకు ఆశవుతుంది
కంటి చూపుకు లక్ష్యమవుతుంది
కన్నె మనసుకు కోరికవుతుంది
కడుపు మంటకు ఆకలవుతుంది
కాని వాళ్ళకు పగవుతుంది
లేని వాళ్ళకు కరువవుతుంది
పసుపు తాడుకు పెళ్ళవుతుంది
పలుపు తాడుకు పశువవుతుంది
సాధన చేస్తే సులువవుతుంది
వొడిసి పడితే నేర్పవుతుంది
సాగుచేస్తే పంటకొస్తుంది
సేవచేస్తే చరితార్ధమవుతుంది