Tuesday, January 22, 2013

Life has to GO ON


నిన్నని తెచ్చేదేది, రేపుని చూపేదేది
నిన్నలో నిలిచిపోతే, రేపుకై తొలిఅడుగేది
నడవడం నేర్పాలా..... నీ పాదాలకీ 
పువ్వులా పూసేది, పైసా ఖర్చులేనిది
పెదవిపై విరిసే నవ్వు, మనసులో సిరివెన్నెల కాదా
నవ్వడం నేర్పాలా..... నీ పెదవులకీ 
మనసులో బాధల బరువు, మోయడం జీవితపరుగు
నూరేళ్ళకు సైతం సడలదు ఆ బిగువు
నవ్వుతూ సాగితే బ్రతుకు, దొరకదా ఆనందపు మధువు
కష్టాన సైతం మరువకు ఆ చిరునవ్వు

చీకటి వెలివేయగలమా, వేకువే వాకిట నిలిపేయగలమా
రాత్రి వేళ నిద్రతో సర్దుకుపోమా
ఆకలి ఆపేయగలమా, పొట్టనే పస్తులుంచగలమా
కోపంలో అయినా  చాటుగా కొంచెం తినమా
జాలిపడితే జరుగదు కాలం
వెంటపడిన నిలువదు నిమిషం
క్షణమైనా క్షమించని పంతం
ఇది పగలు రేయి, గెలుపు ఓటముల వృత్తం

చావునే చంపేయగలమా, వయసునే ఆపి బంధించగలమా
పుట్టిన రోజులు చేస్తూ ముందుకుపోమా
ఓటమిని నిందించగలమా, రావద్దని బెదిరించగలమా
గెలుపు కోసం ప్రతి మలుపుని దాటుకుపోమా
ఈర్షపడితే ఒరగదు లాభం
కక్షగడితే అందదు గమ్యం
విసుగుపుడితే మొదటికే మోసం
ఇది లాభం నష్టం, కష్టం సుఖముల వృత్తం