Monday, January 14, 2013

మా ఇంటి సీతమ్మ మీ ఇంటి కొచ్చేవేళ





తెలుగింటి పెరటిలో పచ్చని గోరింట
జానకి చేతిలో ఎర్రని జాబిలయ్యే
పుట్టిన ఇంట కన్నెసిరి సీతమ్మ
మెట్టిన ఇంట దీపమయ్యేనులే
తలవంచి నడిచే ఈ సుగుణమే
నిలిపేను ఇరుఇంటి గౌరవం
మనువాడ వచ్చిన ఓ రామయ్యా
మనసార అందించు నీ చెలిమి

ఇంటి గడపకు పసుపు పూసి
తోరనాలే వేలాడదీసి
పెళ్లి పందిరి నీడలో, పలుకుతున్న ఆహ్వానం
కొత్త సంబంధానికి శ్రీకారం, ఇది బాంవ్యాలకు ప్రాకారం

బంధువులను పలుకరిస్తూ
బంతివరుసలో విందుచేస్తూ
ఊరిజనం ఒక్కటై, జల్లుతున్న అక్షింతలే 
నూరేళ్ళ పంటకు విత్తనం, నలుదిక్కులకు సాక్ష్యం 

మూడుముళ్ళకు విలువ ఇచ్చి
ఏడు అడుగులు వెంట నడచి
నీతో వచ్చును మాసీతమ్మ, కారడవికైనా కాదనక
నిన్నే నమ్మెను ఈ బొమ్మ, పగలనీకు జారవిడిచి

కన్నె వయసు కన్న కలలు
వరుడు ఒడిలో వాలే వేళ
మనసులో ఆశలే, కనులు వ్రాసే ప్రేమలేఖలు
పెదవి విప్పి తెలుపకుంటే, చొరవచూపి తెలుసుకో