Wednesday, January 9, 2013

వెంటపడతావెందుకు




వెంటపడతావెందుకు వద్దు వద్దు అంటే
కంటపడతావెందుకు  కనులు మూసుకుంటే
ముద్దు పెడతావెందుకు హద్దు హద్దు అంటే
ఎదురు పడతావెందుకు వెళ్ళిపోమంటే

ఆరుబయట వాకిట్లో చుక్కల ముగ్గే వేస్తుంటే
చల్లగాలిలా ననుచేరి చక్కిలిగింతలు పెడతావెందుకు
ఒక్కదాన్నే పడుకున్నా గది తలుపులు మూసున్నా
ఇంతలో వింతగా మది తలుపులు తడతావెందుకు

చల్లని వెన్నెల వేళ, కన్నులు మూసి నిదురించే వేళ
చెక్కిలి తడిమే ముద్దవుతావు
వెచ్చని వేకువ వేళ, నిదుర కన్నులు తెరిచే వేళ
పలుకరించే తొలి పిలుపవుతావు
నడుము వంపున అల్లరి చేస్తావు
మనసు మాటున అలజడి చేస్తావు
నలుగురి మధ్యన నన్నే నవ్వుల పాలే చేస్తావు

మల్లెలు పూసే వేళ, మాలగ గుచ్చి జడను గుప్పేవేళ
వెనకనుండే కౌగిలవుతావు
మబ్బులు కురిసే వేళ, చల్లని గాలికి మేని వణికే వేళ
వెచ్చగ తగిలే చలిమంటవుతావు
ఒంటరి వయసుకి జంటవుతావు
సొగసు బరువుకి కూలి అవుతావు
ఊహల నిండా నిండి నన్నే ఉక్కిరి బిక్కిరి చేస్తావు