Wednesday, January 2, 2013

Sometimes Words are Useless




చక్కిలిగింతకు చేతి స్పర్శ చాలు
చెక్కిలి ఎరుపుకు పెదవి ముద్దు చాలు
గుప్పెడు మనస్సు గంపెడు ఆశకు
చప్పుడు చేయని కనురెప్పల సైగ చాలు

వెక్కిళ్ళ వేళ తలపై తడితే చాలు
నిదురించే వేళ జోకొడితే చాలు
మాట నేర్వని పసితనానికి
అడగకుండా అర్ధమయ్యే అమ్మ మనసు భాష చాలు

వరసైన వేళ చూపు చేసే యుద్ధం చాలు
మనసైన వేళ మాటరాని మౌనం చాలు
వెన్నెల వేళ వన్నెల ఆటలో
అలసి చేసే వేడి నిట్టూర్పులు చాలు

ఓటమి వేళ భుజం తడితే చాలు
గెలిచిన రోజుకు నలుగిరి చప్పట్లు చాలు
తెలియక చేసే తప్పులకు 
గాడిలో పెట్టే నాన్న చేతి దెబ్బలు చాలు