కూలి నాలి చేసేటోళ్ళం
ఇటుక రాళ్ళు మోసేటోళ్ళం
మట్టిచేతుల లేబరోళ్ళం
మురికివాడలో ఉండేటోళ్ళం
మేడమీద మేడలు కడతాం
చేయి చాచని పోగరబోతులం
కడుపు నిండని ఒంటిపూటగాళ్ళం
పస్తులు ఉంటూ రోజులు గడిపి
కోరిక చావక పుస్తెలు కడతాం
కట్టెలు కొడుతూ సాగిపోతాం
కడుపునిండని బ్రతుకుల్లో
నిండు కడుపుతో పిల్లలుకంటాం
ఎదిగే వరకు సంకనుంచి
ఉన్నరక్తమే పాలుగా చేసి
చెట్టు కొమ్మకే ఊయల కట్టి
చమట చుక్కలే ఉగ్గుగా పట్టి
కష్టం విలువే తెలియజేస్తాం
ఉప్పుగంజికే అలవాటు చేస్తాం
బ్రతుకు బండిఫై ఆశేలేదు
కష్టం మరిచే ఊసే రాదు
కష్టం మరిచే ఊసే రాదు
కడుపు నిండినా, నిండుకున్నా
నిద్రలోకి జారుకొంటాం
నిన్న రేపు గుర్తే రావు
ఆశలు కలలు తలపేరావు
జాలి చూపకండి మాపైనా
పని కల్పించండి ఇకనైనా