నా గుండెలోన పెరుగుతున్న ఈ వేగం
నీ సొగసు చేసే హింసకిది సంకేతం
నా గొంతులోన మాటరాని ఈ మౌనం
నీ మనసుకేసి పంపుతున్న సందేశం
పదుగురి ఎదుట పలుకరింపులు
కుదరక కుదురుగా కూర్చున్నా
ఇరువురి మధ్యన ఏకాంతం కోసం
రేయి పగలు ఎదురుచూస్తున్నా
నీ కసిరే చూపులు విసిరే లేఖలు
నా గడసరి మనసుకు చేరుతువున్నా
నీ సొగసరి సొగసుని చేరలేకనే
విసుగుతో వయసును విసిరేస్తున్నా
హద్దులు వేసే పెద్దలెందరున్నా
నీ ముద్దుని తీర్చే వాడు ఒకడేలే
సరిహద్దులు దాటే మనసు నీకున్నా
ఎదురుగ వచ్చి ఎడమై నిలిచావేం
నీ ఊహల వేడికి ఊపిరి సెగలకి
నా దేహం లేహ్యమై కరుగుతువున్నా
నీ కౌగిలి చేరే వరములేకనే
బాహువులతో బాధను బంధిస్తున్నా
వలపు వాంఛలను ఎవరు అడ్డేది
తపనలు తీర్చే వాడు ఎదురైతే
కారుమేఘమై ఎద మెరిసాక
కురవక నిలిచి బెదురుగ చూస్తావేం