మేడలైనా మిద్దెలైనా ముద్ద తరువాతే
ఆకలిలో ఆశయాలు గుర్తురావులే
సొమ్ములైనా సోకులైనా గెలుపు తరువాతే
గెలుపునే గెలవడం ఓటమిలో బ్రతకడమే
మనసుపడితే ఆరాటం మనిషి చేసే పోరాటం
చావుతోనే చెలగాటం రోజువారీ జీవితం
విడిచిపెడితే ఈ బాట విలువేది బ్రతికింక
విడుదలయ్యే వేళకు బ్రతికుండేదెవడులే
కాసులకు కష్టానికి పొంతన లేదులే
చమట చిందేవాడు వట్టి కూలీ మాత్రమే
లక్షలకు లక్ష్యానికి లింకు పెట్టకులే
స్వచ్చమైన గెలుపు అవి లక్ష్యపెట్టదులే
మనిషి మనిషికి అర్ధమయ్యేది ఆకలిలే
ఆ కేకలతో కాకులులా ప్రతీవాడు తిరుగులే
ఓటమికి ఓరిమికి మంచి స్నేహముందిలే
గెలుపు వేళ అరుపులకు అది బీజమవునులే
మినుగురు పురుగులా బ్రతికితే ఆశ
వేకువలో వెలుగే ఎదురవదా
పారే యేరులా శ్రమపడే వరస
పోలమే చేరి పంటవదా
జననానికి మరణానికి దేవుడు వేసే సమతూకం
పుట్టేవాడిని ఎవరు వెలివేయగలం
పరదాలలో సరదాలలో బురద ఈ జీవితం
కమలంలా ఎదగడమే తెలివైన గుణం
మనవాడికి పగవాడికి ప్రథమ అవసరం
ప్రతిపూట అలవాటుగా ఆకలేయడం
బ్రతుకాటలో పొరపాటులు బహు సహజ లక్షణం
మెళకువలు నేర్వడమే మెరుగైన జీవితం
వెలుగురేఖలకు మేలుకొనే హృదయం
ధరిత్రికి పంచే వెలుగవదా
ఆశయమెరుపుకు కురిసే మదిమేఘం
నలుగురి ఇంట పన్నీరవదా