కాదనలేని నిజాలకు
గంతలు కట్టిన కళ్ళు సాక్షాలైతే
వేదన నిండిన ఎదలకు
నివేదించే తోడు కరువైతే
గోడలు లేని గదులలో
గడపలు లేని కట్టుబాట్లలో
హద్దులు దాటని పసిహృదయాలు
పెద్దల పరువు ఆటలో పావులు
నిదుర మరచిన కన్నులు
ఆశలు విడిచిన మనసులు
నిన్నను మరువని జ్ఞాపకాలు
రేపును కోరని జీవితాలు
ఎగసి పడ్డ కెరటమిది
జారి పడ్డ గాజుబొమ్మ ఇది
బ్రతుకు బడిలో గుణపాఠమిది
నూటికి లోపే మనిషి జీవితం
కోటిలో ఒకటే ప్రేమ విజయం
తెలియక చేసిన నిన్న ప్రణయం
నేటికి మిగిలెను ఒంటరి తనం
ఆద్యం ఆమె స్నేహం
మధురం ప్రేమ తీరం
గాయం దాని శేషం
బ్రతుకుకే బరువైన జ్ఞాపకాలు
మనసులో ముసిరిన కారుమేఘాలు
ఉరిమి కురవగా కారెను కంట నీరు
ప్రేమే నిజమని నమ్మితే
నిజమైన ప్రేమకు ఇది పరిపాటే
జాలిలేని జీవితం నీడలో
ప్రాణమే మోయలేని రోజులో
ఆయువే తీరిపోయే వరము చాలు
ప్రేమ గరళము కాదులే, అందుకే
మనసుని చంపి మనిషిని విడిచే